ఏపీ నుంచి అయోధ్యకు బస్సులపై ఆర్టీసీ జోన్ ఈడీ చెంగల్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భక్తులు, ప్రయాణికులు బృందంగా వస్తే.. కడప నుంచి అయోధ్యకు ప్రత్యేక బస్సు సర్వీసుల్ని(అద్దె ప్రాతిపదికన) నడుపుతామని చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి అయోధ్యకు నాలుగు బస్సులను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.. ఆ కార్యక్రమం విజయవంతమైందని.. ఇప్పుడు అదే తరహాలో కడపలో అమలుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో కొత్త ఆర్టీసీ గ్యారేజీని ప్రారంభిస్తామని.. ఈ మేరకు ఇంజినీరింగ్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు.
కడప ఆర్టీసీ జోన్ రాష్ట్రంలోనే అతి పెద్దదని.. దీని పరిధిలో 52 డిపోలున్నాయని చెప్పారు. అలాగే వచ్చే నెలలో.. దసరా, తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బసు డ్రైవర్లకు సంబంధించి హ్యాపీ వీకెండ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్గో ఆదాయాన్ని పెంచుతామని.. ఎవరైనా కార్గో ఏజెంటుగా పని చేయాలనే ఆసక్తి ఉంటే తమను సంప్రదించాలని చెంగల్ రెడ్డి సూచించారు. అంతేకాదు విహారయాత్రలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన కేటాయిస్తామని తెలిపారు.
ఏపీ టూరిజం హైదరాబాద్ నుంచి తిరుమలకు బస్సు ఏర్పాటు చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి బస్సు (వోల్వో ఏసీ స్లీపర్) ప్యాకేజీని ప్రారంభిస్తున్నట్లు ఏపీ టూరిజం డీవీఎం డీవీ చంద్రమౌళిరెడ్డి తెలిపారు. ఈ సర్వీసు హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా వెళుతుందన్నారు. ఈ టూర్‌లో తిరుమల వెంకటేశ్వర స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం, భోజనం తదితర సదుపాయాలతో ప్యాకేజీతో రూపొందించామన్నారు. ప్రతి రోజూ రాత్రి 11 గంటలకు కర్నూలులోని వెంకటరమణ కాలనీలోని ఏపీ టూరిజం కార్యాలయం నుంచి ఈ బస్ సర్వీస్ బయలుదేరుతుందన్నారు. బస్సు ఛార్జీ విషయానికి వస్తే.. పెద్దలకు అయితే రూ.3930, పిల్లలకు (4-10 ఏళ్లు) రూ.3,630గా నిర్ణయించారు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు తిరుమల టూర్ ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తిరమలకు ప్రత్యేక ప్యాకేజీతో బస్సులు నడుస్తున్న సంగతి తెలిసిందే.