వైఎస్సార్‌సీపీ నేతలకు సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో..దేవినేని అవినాష్, జోగి రమేష్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్‌లు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపింది. 24 గంటల్లో దర్యాప్తు అధికారులకు పాస్‌పోర్టులు అప్పగించాలని వారిని ఆదేశించింది. 3 వారాలపాటు వారిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. అలాగే దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని తెలిపింది. దర్యాప్తునకు సహకరించకపోతే రక్షణ ఉండదని పిటిషనర్లకు తెలిపింది. అలాగే సాంకేతిక కారణాలతో నేడు పూర్తిస్థాయి విచారణ చేపట్టలేకపోతున్నామని ధర్మాసనం తెలిపింది.. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది.
2021లో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వైఎస్సార్‌సీపీ నేతలు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. అలాగే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తాడేపల్లి పోలీసులు 2021లో నమోదు చేసిన కేసులో జోగి రమేష్, ఆయన అనుచరులు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దౌర్జన్యం , దాడి కేసుల్లో నిందితులుగా ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది.. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన అనుచరులు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్లను కూడా కొట్టేసింది.
ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్లు అర్హులు కారని కోర్టు వ్యాఖ్యానించింది. వీరికి బెయిలిస్తే సమాజంలోకి చెడు సంకేతాలు వెళతాయని అభిప్రాయపడింది. అయితే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించేంతవరకైనా అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని నిందితులు కోరారు.. రెండు వారాలపాటు సమయం ఇవ్వాలని కోరగా తోసిపుచ్చింది. తాము ఒకసారి బెయిలివ్వడానికి నిరాకరించాక.. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమన్నారు. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైల్లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa