రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, వాటిలో 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే, ఈ ఏడాది మరో 5 కాలేజీలు కూడా మొదలై ఉండేవని తెలిపారు. కానీ, సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల, అవి ప్రారంభం కాకపోగా.. జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన 50 మెడికల్ సీట్లు కూడా పోయాయని ఆక్షేపించారు. ఆ సీట్లు వద్దంటూ ఎన్‌ఎంసీకి ప్రభుత్వం లేఖ రాయడం దుర్మార్గమని ఆగ్రహించారు.