రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణమని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్షేపించారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గమన్నారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు అంటూ నిలదీశారు. వైద్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ఎండగట్టారు. నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అదించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబు గారూ? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా?. దీన్ని గుర్తించే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023-24 సంవత్సరాల్లో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలామంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవడం లేదా?. నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలోనే మరో 5 కాలేజీలు మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్‌ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంచేసే స్కామ్‌లకు ఆలోచన చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.