బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పని తీరు అద్భుతంగా ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలనూ సమన్వయం చేసి వరద బాధితులను ఆదుకున్న తీరుపై దేశవ్యాప్తంగా సీఎంపై ప్రశంసలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సింగ్ నగర్‌లో చంద్రబాబు చిత్రపటానికి బొండా ఉమా, టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. వరద బాధితులకు సేవలు అందించిన వివిధ శాఖల సిబ్బందిని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ.."వరద సహాయక చర్యల ద్వారా సీఎం చంద్రబాబు పాలన ఏంటో అందరికీ అర్థమయ్యింది. నాయకుడు అంటే తాను నడుస్తూ, నడిపించే వారని చంద్రబాబు ఆచరించి చూపించారు. వరదలు వచ్చిన మెుదటి రోజు ఆదివారం. ఆ రోజు ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగిపోయింది. భారీగా నీరు ముంచెత్తడంతో ప్రజలు అల్లాడిపోయారు. ముంపు ప్రాంతాలను చూసిన ముఖ్యమంత్రి చలించిపోయారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తన కార్యాలయంగా చేసుకుని 10రోజులు నిరంతరాయంగా పని చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారిని ఆదుకున్నారు. ఎంపీ కేశినేని చిన్నిని, నన్ను, మంత్రులు అందరినీ ముంపు ప్రాంతాలకు సీఎం పంపారు. విజయవాడలోని ప్రతి డివిజన్‌కు మంత్రులు, ఐఏఎస్‌లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సీఎం రంగంలోకి దింపారు. 10రోజులపాటు ఆహారం, నీరు, పండ్లు, పాలను వరద బాధితులకు అందేలా చేశారు. ఇప్పుడు కూడా సర్వే చేయించి బాధితులను ఆదుకునేలా చర్యలు చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ వయసులోనూ వరదలో నడుస్తూ, తడుస్తూ, ట్రాక్టర్ ఎక్కి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల బాధను స్వయంగా చూశారు. వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలూ చేపట్టారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని ప్రజలను గాలికొదిలేశారు. పైగా ఇంత కష్టపడిన మా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారు. అయినప్పటికీ వైసీపీ నేతల మాటలు పట్టించుకోకుండా మా పార్టీ అధినేత స్ఫూర్తితో వేలాదిమంది టీడీపీ నేతలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా నిలిచారు" అని అన్నారు.