పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరులోని శ్మశాన వాటిక రహదారి వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. పాలకోడేరు శివారులోని పంతొట్టి వద్ద ఉన్న శ్మశానవాటిక దారి విషయమై కొంత కాలంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారికి, గ్రామంలోని కొంతమందికి మధ్య తగువు నడుస్తున్నది. ఈ క్రమంలోనే శనివారం గ్రామంలో ఒక మహిళ మృతి చెందటంతో ఆ మృతదేహాన్ని పంతొట్టి నివాసాల మధ్య నుంచి తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రాంత వాసులు ఇటువైపుగా రహదారి లేదని గతంలోనే అధికారులు తెలియపరచటం కూడా జరిగిందని అడ్డు చెప్పడంతో గ్రామంలోని రావిచెట్టు సెంటర్‌లో మృతదేహం పెట్టి గంటపాటు గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. దీంతో అటు భీమవరం వైపు ఇటూ తణుకు వైపు వెళ్ళే వాహనాలు, వేండ్ర వైపు వెళ్ళే వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భీమవరం రూరల్ ఇన్‌చార్జ్ సీఐ కాళీచరణ్, డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణరాజు, ఎంపీడీవో గంగాధరరావు, పాలకోడేరు ఎస్సై హరిబాబు, కాళ్ళ ఎస్సై నాళం శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇటు బాధితులతో, పంతొట్టి నివాసవాసులతో మాట్లాడి సమస్యను ప్రస్తుతానికి పరిష్కరించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రహదారిపై మృతదేహం పెట్టి రాస్తారోకో చేయడం సరికాదని పంతొట్టి వాసులతో మాట్లాడి ప్రస్తుతానికి మృతదేహాన్ని అధికారులు ఖననం చేయించారు. సోమవారం గ్రామనాయకులు, అధికారులతో కూర్చుని మాట్లాడుకుని శ్మశాన వాటిక సమస్య పరిష్కారం అయ్యేవిధంగా కృషి చేస్తామని అధికారులు తెలిపారు.