ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ కార్మికులు చేపట్టే పోరాటాలకు అండగా ఉంటామని విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 1311 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని శనివారం వారు సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉక్కు కార్మికులను ఉద్దేశించి శ్రీభరత్ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారంలో పూర్తిస్థాయి ఉత్పత్తి జరిగేందుకు అవసరమైన నిర్ణయాలను కేంద్రం తీసుకునే విధంగా కృషిచేస్తానన్నారు. ఉత్పత్తి తగ్గడం, ఆర్థిక భారం ఎక్కువ కావడం, బ్లాస్ట్ ఫర్నేస్‌లు మూత పడడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని, వారికి భరోసా కల్పించాలనే తాను వచ్చానన్నారు. మూడు నెలలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర ఉక్కు మంత్రి, ఇతర కేంద్ర మంత్రుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కేంద్ర ఉక్కు మంత్రి ఆది నుంచి ఉక్కు పరిరక్షణకు కృషిచేస్తానని హామీ ఇస్తున్నారన్నారు. ఉక్కు పరిరక్షణే అందరి ఏకైౖక ధ్యేయమన్నారు. ఉక్కు కర్మాగారాన్ని లాభాల్లోకి తేవడమే మన లక్ష్యమన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తొలి నుంచి తాను చెప్పే మాట ఒకటేనని, విశాఖ స్టీలుప్లాంటును పరిరక్షించకపోతే రాజీనామా చేసి, ఉక్కు కార్మికులతో పోరాటాల్లో పాల్గొంటానన్నారు. కార్మికులు, నిర్వాసితులు ఆందోళన చెందవద్దన్నారు. కార్మికుల పట్ల ఉక్కు యాజమాన్యం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలనూ, కర్మాగారం ఈ స్థితికి రావడానికి దారితీసిన పరిస్థితులను ప్రజా ప్రతినిధులకు కార్మికులు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్, నాయకులు నల్లూరు సూర్యనారాయణ, ప్రసాదుల శ్రీనివాస్, ఉక్కు పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె.అయోధ్యరామ్, ఎన్.రామారావు, కేఎస్‌ఎన్ రావు, విళ్లా రామ్మోహన్‌కుమార్, వరసాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.