తూర్పుగోదావరిజిల్లా రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు(70) భార్య అప్పయ్యమ్మ(64)అనే వృద్ధ దంపతులు గ్రామంలో రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం కాగా, వీరిలో కొడుకు రాజమహేంద్రవరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ దుస్తులు ఇస్త్రీ చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామంలో ఒంటరిగా జీవనం సాగిస్తున్న వీరికి వయోభారంతో కంటిచూపు మందగించింది. ఇదే గ్రామంలో వేరొకచోట ఉంటున్న కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సపర్యలు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఒక కోతి గుళికల పొడి ప్యాకెట్టు తీసుకొచ్చి ఇంటిపై పడేసింది. అది కాస్తా కిందికి జారి వాకిట్లో పడింది. కాఫీ పొడిగా భావించి ఇంట్లో పెట్టారు. దీనిని అప్పయ్యమ్మ కాఫీ పొడి అనుకుని శుక్రవారం పాలలో వేసుకుని కాఫీ కాసుకుని ఇద్దరు తాగారు. అనంతరం కొద్దిసేపటికి మగతగా ఉండటంతో మంచంపై వాలిపోయారు. మంచంపై పడిఉన్న వీరిని సమీపంలోని ఓ వ్యక్తి చూసి పిలిస్తే పలకకపోవడంతో అనుమానంతో గ్రామంలో నివసిస్తున్న కూతురికి సమాచారం అందించాడు. కుమార్తె హుటాహుటిన ఇంటికి వచ్చి తల్లిదండ్రులను చూసి ఏమైందని అడగ్గా రెండు రోజుల క్రితం కోతి ఒక కవర్ తెచ్చి ఇంటిపై వేసిన కాఫీ ప్యాకెట్ నుంచి రెండు స్పూన్ల పొడి తీసుకుని కాఫీ కాసుకుని తాగామని చెప్పారు. దీంతో అనుమానంతో ఇంట్లో కెళ్లి ప్యాకెట్ పరిశీలించగా అది ఏవిధమైన వాసనలేని గుళికలు మందు ప్యాకెట్‌గా గుర్తించి, ప్రాణాపాయస్థితిలో ఉన్న తల్లిదండ్రులను ఆటోలో ఎక్కించి చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈమేరకు కూతురు కోటిపల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాజానగరం ఎస్‌ఐ వెంకట రేవతి శనివారం తెలిపారు. శవపంచనామా అనంతరం పోలీసులు పోస్టుమార్టం జరిపించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. వృద్ధ దంపతులు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు వీరి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.