ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్నీపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఫైల్ మీద సీఎం చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు. దీంతో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌కు సంబంధించి 1590, 1591, 1592 జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో వీరిపై అభియోగాలు రాగా.. దీనికి సంబంధించి డీజీపీ నివేదిక ఆధారంగానే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేశారు.
మరోవైపు తప్పుడు కేసులో తనను అక్రమంగా తనను నిర్బంధించి, హింసించారంటూ కాదంబరి జత్వానీ ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జత్వానీ ఫిర్యాదు మేరకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ సహా మరికొందరిపై ఇప్పటికే ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిపై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, రెడ్‌విత్ 120బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం సైతం విజయవాడ మాజీ ఏసీపీ హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను సైతం సస్పెండ్ చేసింది. గతంలో ఇబ్రహీంపట్నం సీఐగా పనిచేసిన సత్యనారాయణ కేసును పరిశీలించకుండానే కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. అలాగే విజయవాడ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావుపై కూడా అభియోగాలు ఉన్నాయి.
కాదంబరి జత్వానీని ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు అయిన అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు తీరుపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఈ అభియోగాలపై విచారణ జరిపి.. నివేదిక రూపొందించారు. ఈ నివేదికను డీజీపీకి సమర్పించారు, ఈ నివేదిక ఆధారంగానే ముుగ్గురు ఐపీఎస్‌ల మీద చర్యలు తీసుకున్నారు.