ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనలో తనదైన మార్కు చూపిస్తోంది. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు తనదైన రీతిలో సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గ సమావేశాలను ఈ- కేబినెట్‌గా మార్చారు. మంత్రివర్గ సమావేశాలలో పేపర్ల వాడకం తగ్గిస్తూ,, కాగిత రహిత కేబినెట్ భేటీలను తీసుకువచ్చారు. తాజాగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలను మార్చే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇంకా రాచరికపు పోకడలు కనిపిస్తున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. వాటిని తొలగించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల రూపురేఖలు మార్చేలా ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చునే విధానాన్ని మార్చాలని భావిస్తున్నారు. కోర్టు్ల్లో న్యాయమూర్తుల తరహాలో సీటింగ్ ఉందని.. దీనిని తీసివేయాలంటూ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక కార్యదర్శి ఆర్సీ సిసోదియా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. అన్ని గవర్నమెంట్ ఆఫీసుల తరహాలోనే సబ్ రిజిస్ట్రార్ సీటింగ్ కూడా ఉండాలని అందులో పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కూర్చునే ఎత్తైన పోడియాన్ని తీసివేసి.. సాధారణ ఎత్తులోనే ఉంచాలని సూచించారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ పోడియం చుట్టూ ఉండే ఎర్రటి వస్త్రాన్ని తొలగించాలని ఆదేశించారు.
ఇక రిజిస్ట్రేషన్ పనుల మీద సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వచ్చే సామాన్య ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారిని నిలబెట్టరాదని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమయ్యే పరిస్థితుల్లో వారిని కూర్చోబెట్టి తాగడానికి మంచినీరు, టీ వంటివి అందించాలని ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. మరోవైపు ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే జనం.. సబ్ రిజిస్ట్రార్ పోడియం ముందు నిలబడి రిజిస్ట్రేషన్ చేయడం.. అమర్యాదగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ మార్పులు చేయాలంటూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది.