ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో కలకలం.. సీఎంవైపు దూసుకొచ్చిన అజ్ఞ‌ాత వ్యక్తి

national |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 10:36 PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సభలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. సీఎం వేదికపై ప్రసంగిస్తుండగా ఓ అజ్ఞ‌ాత వ్యక్తి ఆయనవైపు దూసుకురావడంతో కలకలం రేగింది. దీంతో తక్షణమే అప్రమత్తమైన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతడ్ని కాంగ్రెస్ కార్యకర్తగా గుర్తించారు. సిద్ధరామయ్యకు శాలువా వేయడానికి అతడు వస్తున్నట్టు విచారణలో వెల్లడి కావడంతో పోలీసులు, కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరులో ఆదివారం జరిగిన ప్రజాస్వామ్య దినోత్సవంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సమయంలోనే చేతిలో పసుపు రంగులో ఉన్న ఓ వస్త్రం పట్టుకుని ఓ వ్యక్తి వేదికపైకి పరుగెత్తుకొచ్చాడు.


వెంటనే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని.. కిందకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే అతడ్ని పట్టుకున్నారు. ఈ ఘటన వల్ల కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ వ్యక్తిని మహాదేవ్ నాయక్‌గా గుర్తించారు. అతడు ముఖ్యమంత్రికి శాలువాను కప్పేందుకు ప్రయత్నించాడని పోలీసులు అధికారులు తెలిపారు.


ఏఎన్ఐతో మాట్లాడిన డీసీపీ ‘సీఎం సిద్ధరామయ్యకు శాలువా వేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం.. అతడ్ని మహాదేవ్ నాయక్‌గా గుర్తించాం.. అతడికి చట్టబద్ధమైన సరైన గుర్తింపు ఉంది. అయితే ఆయన సీఎంకు పూలమాల వేసేందుకు ప్రయత్నించారు.. ఇది ఒక ఉల్లంఘన. విధివిధానాల ప్రకారం అతడిని అదుపులోకి తీసుకున్నారు’ అని వివరించారు.


కాగా, బెంగళూరులోని నాగమంగళాలో నిమజ్జనం సందర్భంగా విగ్రహాన్ని పోలీసులు అపవిత్రం చేసినట్టు వివాదం రేగిన మర్నాడే ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు వ్యాన్ లోపల గణేశ విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఇది రాజకీయ, మతపరమైన విమర్శలకు దారితీసింది. పోలీసుల అనుమతి లేకుండా కొందరు గణేష్ శోభాయాత్రను చేపట్టడంతో పలువుర్ని అరెస్ట్ చేసి.. విగ్రహంతో సహా వ్యాన్‌లో వేశారు. ఇది వివాదాస్పదం కావడంతో విచారణకు పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదిలా ఉండగా.. కర్ణాటకలో ముడా కుంభకోణం ప్రకంపనలు రేపుతోన్న విషయం తెలిసిందే. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతించడంపై దుమారం రేగింది. సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించడంతో కేసు పెండింగ్‌లో ఉంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలతో కన్నడ రాజకీయాలు వేడెక్కాయి.


ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్నను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేయడం మరో వివాదం మొదలైంది . బెంగళూరు కార్పొరేషన్‌కు చెందిన కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి.. పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో కాంగ్రెస్, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలేందుకు కారకులైన 17 మంది ఎమ్మెల్యేల్లో మునియప్ప కూడా ఒకరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com