ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారంలోకి వచ్చిన గంటలోపే మద్యపానంపై నిషేధం ఎత్తేస్తా.. ప్రశాంత్ కిశోర్

national |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 10:37 PM

జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. తన సొంత రాష్ట్రం బిహార్‌లో మద్యపాన నిషేధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన గంటలోనే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించారు. 2022 అక్టోబరు 2న జన్ సూరజ్ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్.. దానిని రాజకీయ పార్టీగా మార్చుతున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబరు 2న జన్ సూరజ్ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. రెండో వార్షికోత్సవానికి ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవని అన్నారు.


 ‘పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదు.. గత రెండేళ్లుగా మేము సిద్ధంగానే ఉన్నాం.. రాష్ట్రంలో జన్ సూరజ్ ప్రభుత్వం అధికారంలో వస్తే గంటలోనే మద్యపానంపై నిషేధాన్ని ఎత్తివేస్తాం’ అని అన్నారు. ఆర్జేడీ నేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ యాత్ర గురించి కూడా పీకే స్పందించారు. ‘ఆయనకు నా శుభాకాంక్షలు.. కనీసం ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చి.. జనంలోకి వెళ్తున్నారు’ అని అన్నారు. ఆర్జేడీ, సీఎం నితీశ్ కుమార్ మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సమయంలో ప్రశాంత్ కిశోర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


తన తల్లి రబ్రీదేవి వద్దకు వచ్చిన నితీశ్ కుమార్.. ఎన్డీయేలో చేరినందుకు రెండు చేతులు జోడించి క్షమాపణలు చెప్పారని తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ తీవ్రంగా స్పందించింది. అయితే, ఇరువురు నేతల వల్ల రాష్ట్రానికి నష్టమని పీకే విమర్శించారు. ‘అది నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ మధ్య వివాదం.. ఎవరు ఎవరికి చేతులు కట్టుకుని క్షమాపణలు చెప్పినా పట్టింపు లేదు.. ఇరువురూ బీహార్‌కు నష్టం కలిగించారు.. గత 30 ఏళ్లుగా బీహార్ ప్రజలు వారిద్దరినీ చూశారు. వారి నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పీకే అన్నారు.


గతంలోనూ తేజస్వీ యాదవ్‌ విద్యార్హతలపై ప్రశాంత్ కిశోర్ విమర్శలు చేశారు. ‘వనరుల కొరత వల్ల ఎవరైనా చదువుకోలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు.. తల్లిదండ్రులు ముఖ్యమంత్రులుగా ఉండి.. అతడు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించలేకపోతే.. విద్య పట్ల వారి దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘9వ తరగతి డ్రాపౌట్ బిహార్ అభివృద్ధి గురించి మాట్లాడుతారు.. ఆయన (తేజస్వీ యాదవ్)కు జీడీపీ, జీడీపీ వృద్ధికి తేడా తెలియదు.. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తనకు తెలుసుంటున్నారు’ ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com