టీడీపీ కూటమి ప్రభుత్వంపై మూడు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. అందుకే వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అదేపనిగా తమపై విషం చిమ్ముతున్నారని ఆయన వెల్లడించారు. దాదాపు 100 రోజులవుతున్నా, ఈ ప్రభుత్వం కనీసం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదన్న ఆయన, రాష్ట్రంలో ఎక్కడ, ఏం జరిగినా గత మా ప్రభుత్వాన్ని నిందించడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ...... గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఆర్భాటంగా ప్రకటించి, ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఆ హామీల అమలు కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారన్న ఆయన, వారవన్నీ గుర్తు చేస్తున్నారని తెలిపారు. తొలి సంతకంతోనే సూపర్ సిక్స్ హామీలు అమలవుతాయని ఎదురు చూస్తున్న ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలిందని చెప్పారు.