ఏపీలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది. పాత మద్యం విధానం ఈ నెలాఖరుతో ముగియనుంది.ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తేనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏపీ కేబినెట్ భేటీలో నూతన మద్యం విధానం గురించి చర్చించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీ నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై మహిళా సంఘాల ఐక్యవేదిక పలు డిమాండ్లు చేసింది. నూతన మద్యం విధానంలో మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహించకుండా.. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది.
లైసెన్సింగ్ విధానంలో మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయన్న మహిళా సంఘాల ఐక్య వేదిక సభ్యులు.. లైసెన్స్ ఫీజుల ద్వారా 2 వేలకోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వార్తలు వెలువడుతున్నాయన్నారు. ఆదాయం గురించి కాకుండా మద్యాన్ని నియంత్రించడం మీద దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మిన మద్యం బ్రాండ్ల కారణంగా వందలమంది చనిపోయారని చెప్తూ నాణ్యమైన మద్యం అందుబాటులో తెస్తామంటున్న టీడీపీ ప్రభుత్వం.. నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా? మహిళలపై హింసకు కారణం కాదా అనే విషయానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు నూతన మద్యం విధానంలో తమ డిమాండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ మహిళా సంఘాల ఐక్యవేదిక పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. 21 ఏళ్లలోపు వారికి మద్యం తాగడానికి అనుమతి ఇవ్వకూడదన్న ఐక్యవేదిక.. తాగుడు అలవాటు ఉన్న వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసింది. మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారిపైనా, న్యూసెన్స్ చేసేవారిపైనా, నేరాలకు పాల్పడేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నిర్వహించాలన్న ఐక్యవేదిక.. వారంలో ఓ రోజు డ్రైడేగా ప్రకటించాలని కోరింది. గుడి, బడి, బస్టాండులకు దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని.. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో రెండు శాతాన్ని మద్యం వలన కలిగే నష్టాల గురించి వివరించేందుకు ఉపయోగించాలని సూచించింది.
తాగి కుటుంబసభ్యులను వేధించేవారిపై కేసులు పెట్టాలన్న ఐక్యవేదిక.. తాగుడు కారణంగా ఎవరైనా చనిపోతే.. ఆ కుటుంబాల్లోని మహిళలకు పరిహారం అందించాలని డిమాండ్ చేసింది. అలాగే మందుబాబులను గుర్తించి డీ ఎడిక్షన్ కేంద్రాల ద్వారా వైద్యం అందించాలని.. ప్రతి పీహెచ్‌సీలో డీ ఎడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.