జమ్మూ కశ్మీర్‌లో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఓ వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఓ ఇంటి లోపల నక్కిన తీవ్రవాది కదలికలను స్పష్టంగా చిత్రీకరించిన ఈ డ్రోన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బారాముల్లా జిల్లాలోని చక్ తాపర్ క్రీర్‌లో శనివారం రాత్రంతా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఓ భవనంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం రావడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులు అక్కడికి చేరుకున్నారు.
భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేస్తుండగా... ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముష్కరుల చర్యలను తిప్పికొట్టిన సైన్య.. ఎదురుకాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లింది. దీంతో వెనక్కి తగ్గిన తీవ్రవాదులు అక్కడ పారిపోయి తప్పించుకునే ప్రయత్నం చేశారు. భవనం నుంచి బయటకు వచ్చిన ఓ ఉగ్రవాది.. తన చేతిలోని తుపాకీతో కాల్పులు జరుపుతూ ప్రహరీ గోడ పక్క నుంచి వెనక వైపు ఉన్న చెట్లలోకి పరిగెత్తాడు. ఈ సమయంలో సైనికుల అతడిపై కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ తగిలి కిందపడ్డప్పటికీ ఆ టెర్రరిస్ట్ లొంగిపోలేదు. కాల్పులు జరుపుతూ అలాగే పాక్కుంటూ పారిపోవడానికే ప్రయత్నించాడు.
కానీ, వెనక్కి తగ్గని భద్రతా బలగాలు.. అతడిపై కాల్పులు జరిపి అంతం చేశాయి. బుల్లెట్ల వర్షానికి కాంక్రీట్ గోడకు రంధ్రాలుపడి.. దుమ్ము రేగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు 10 సెక్టార్ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండర్ బ్రిగేడియర్ సంజయ్ కనోత్ తెలిపారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. చక్ తాపర్ క్రీర్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని కనోత్ చెప్పారు.
కాగా, కశ్మీర్‌లో ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన పోరాటాల్లో పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కుప్వారాలో శనివారం ఉగ్రవాదులతో పోరాడుతూ ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లోయలో అలజడికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేయని ప్రయత్నం లేదు. అయితే, వారి ప్రయత్నాలను తిప్పికొడుతోన్న సైన్యం.. ముష్కరుల కోసం వేట సాగిస్తోంది. పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1న మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. హరియాణాతో పాటు ఈ ఎన్నికల ఫలితాలను అక్టోబరు 8న వెల్లడిస్తారు.