ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి కొన్ని నెలలపాటు తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్.. ఇటీవలె బయటికి వచ్చారు. ఈ క్రమంలోనే సంచలన ప్రకటన చేశారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తాను నిర్దోషిని అని రుజువు అయిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపడతానని సంచలన విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని.. ఢిల్లీ ప్రజల ఓట్లతో గెలుపొంది అప్పుడు సీఎం పీఠంపై కూర్చుంటానని పేర్కొన్నారు. కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటన దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ నిర్ణయంతో ప్రజల్లోకి వెళ్లి.. మళ్లీ ఆప్‌కు అధికారాన్ని కట్టబెట్టాలని కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై బెయిల్‌పై బయటికి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనపై అన్నా హజారే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావద్దని గతంలోనే తాను కేజ్రీవాల్‌కు చెప్పినట్లు అన్నా హజారే గుర్తు చేశారు. అయితే కేజ్రీవాల్ తన మాట వినలేదని.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టినట్లు అన్నా హజారే విమర్శించారు. రాజకీయాల్లోకి రావద్దని తాను సలహా ఇచ్చానని.. సామాజిక సేవలోనే నిజమైన విలువ ఉంటుందని ఎన్నోసార్లు వివరించినా.. కేజ్రీవాల్ వినలేదని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రాకూడదని తాను మొదటి నుంచి చెబుతున్నానని.. తన సలహాను పట్టించుకోకూడదని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నాడని అన్నారు. ఇప్పుడు జరిగింది అనివార్యమని.. కేజ్రీవాల్ మనసులో ఏం ఉందో తనకు తెలియదని తాజాగా మీడియాకు అన్నా హజారే వివరించారు.
అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ గతంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. వీరిద్దరూ కలిసి ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో అవినీతికి వ్యతిరేకంగా భారీ ఉద్యమాన్ని చేపట్టారు. ఆ తర్వాత కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రావడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్‌పై ఇప్పటికే ఎన్నోసార్లు అన్నా హజారే స్పందించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కావడంపై అన్నా హజారే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకప్పుడు మద్యానికి, అవినీతికి వ్యతిరేకంగా తనతో పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్.. మద్యం పాలసీ రూపొందించడం, అందులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో తాను తీవ్రంగా కలత చెందినట్లు అన్నా హజారే వెల్లడించారు. కేజ్రీవాల్ చేసిన పనుల పర్యవసానమే ఆయన అరెస్ట్ అని గతంలో అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు.