అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం తీవ్ర కలకలం రేపుతోంది. ఫ్లోరిడాలోని ట్రంప్ సొంత గోల్ఫ్ క్లబ్ వెలుపల ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆయన గోల్ఫ్ ఆడుతున్న సమయంలో తుపాకీతో సంచరిస్తోన్న అనుమానితుడ్ని గుర్తించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. నిందితుడ్ని ర్యాన్ వెస్లీ రూత్ (58) అనే వ్యక్తిగా గుర్తించారు. కాల్పుల తర్వాత ఎస్‌యూవీలో పారిపోతున్న అతడ్ని ఎఫ్‌బీఐ వెంబడించి అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద ఏకే-47 స్వాధీనం చేసుకున్నారు.
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్.. అనుమానితుడు ర్యాన్ వాహనం, లైసెన్స్ ప్లేట్ ఫోటోను సేకరించడం దర్యాప్తునకు ఉపకరించింది. నార్త్ కరోలినాకు చెందిన రూత్‌కు సుదీర్ఘ నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు. అతడి గురించి న్యూయార్క్ కీలక సమాచారం వెల్లడించింది. లింక్డిన్ ప్రొఫైల్‌ను బట్టి రూత్.. నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నాడని, 2018లో హవాయికి షిఫ్ట్ అయ్యాడని తెలిసిందని కథనం తెలిపింది. అంతేకాదు, తన అభిరుచులు, ఆలోచనలు అందులో పంచుకున్నాడని పేర్కొంది.
నార్త్ కరోలినా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడల్ట్ కరెక్షన్స్‌లో రౌత్‌కు సంబంధించిన రికార్డులు 2002 నుంచి ఉన్నాయని, 2003లో లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి అభియోగాలు ఎదుర్కొన్నట్టు వివరించింది. హిట్ అండ్ రన్ కేసులలో రూత్‌కు జైలు శిక్ష పడిందని, 2010లో అతనిపై చోరీ కేసు నమోదయ్యిందని చెప్పింది. అమెరికా రాజకీయాల గురించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను అనుమానితుడు వ్యక్తం చేసేవాడు.
2019లో డెమొక్రటిక్ అభ్యర్థులకు అతడు విరాళాలను అందజేసినట్టు తేలింది. ఇక, 2022 ఏప్రిల్‌లో ట్రంప్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అమెరికాను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఉంచడంపై దృష్టి కేంద్రీకరించాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు రూత్ సలహా ఇచ్చాడు. అమెరికన్లను బానిసలుగా చేయాలని ట్రంప్ భావిస్తున్నారని రౌత్ విమర్శించాడు. అతడికి ఎటువంటి సైనిక నేపథ్యం లేనప్పటికీ రెండేళ్ల జరుగుతోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీవ్ తరఫున పోరాటం చేయాలని తాను బలంగా కోరుకుంటున్నట్టు ఎక్స్‌లో గతంలో పోస్ట్ పెట్టాడు. ఉక్రెయిన్ కోసం పోరాటానికైనా.. చావుకైనా సిద్ధమేనని తెలిపాడు. ఈ యుద్ధాన్ని పౌరులు నిరోధిస్తే.. భవిష్యత్తులో జరగబోయే సంఘర్షణలను అడ్డుకోగలరని ట్విట్టర్ బయోలో పేర్కొన్నాడు.
‘మానవహక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి మద్దతివ్వడంలో మనలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న దశల్లో ప్రతిరోజూ మన వంతు కృషి చేయాలి.. మనమందరం చైనీయులకు సహాయం చేయాలి’ అని వాట్సాప్ బయోలో రాసుకున్నాడు. కాగా, పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత బైడెన్‌కు సలహా ఇచ్చిన రూత్.. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించాలని, మరణించిన అగ్నిమాపక సిబ్బంది అంత్యక్రియలకు హాజరు కావాలని కోరుతూ జూలై 16న పోస్ట్ చేశాడు. నిజమైన నాయకులు ఏమి చేస్తారో ప్రపంచానికి చూపించాలని బైడెన్‌కు సూచించాడు.