అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోసారి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పులు కలకలం రేగింది. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్‌నే లక్ష్యంగా చేసుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ గోల్ఫ్ కోర్టులోనే ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన గోల్ఫ్ ఆడుతుండగా అనుమానాస్పదంగా తుపాకీతో సంచరిస్తున్న వ్యక్తిని సెక్యూరిటీ గుర్తించారు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిపై కాల్పులు జరిపారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాయి.
ట్రంప్‌నకు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. ఆయన సొంతంగా గోల్ఫ్ కోర్టే ఉందంటే ఆ ఆట అంటే ఎంత పిచ్చో అర్ధం చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఉదయం నుంచి లంచ్ ముందు వరకు వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో ఆయన గడుపుతారు. శనివారం తన ఎన్నికల ప్రచారం ముగించుకొని ట్రంప్ ఫ్లోరిడాకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా.. కోర్టులోకి ఆయుధంతో ఓ అనుమానితుడు ప్రవేశించాడు. ఆ సమయంలో ఫెన్సింగ్ వద్ద తుపాకీని దాచిపెట్టిన విషయం గమనించి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
భద్రతా సిబ్బంది అలర్ట్ కావడంతో అతడు అక్కడ నుంచి తప్పించుకుని కారులోని పారిపోయాడని, పోలీసులు వెంబడించి పట్టుకున్నారని తెలిపారు. ఘటనా స్థలిలో ఏకే 47 మోడల్‌ను పోలిన తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. అయితే, ట్రంప్‌ను హత్యచేయడానికే ఆ దుండగుడు వచ్చినట్లు ఎఫ్‌బీఐ అనుమానిస్తోంది. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించారు. అమెరికాలో హింసకు తావులేదని.. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం తెలిసిందని వ్యాఖ్యానించారు. కాగా, కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్‌కు వైట్‌హౌస్ అధికారుల సమాచారం అందించారు. గోల్ఫ్ కోర్టులో జరిగిన ఘటనపై సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ స్పందిస్తూ... తాను ట్రంప్‌తో మాట్లాడానని, ఆయన క్షేమంగానే ఉన్నారని చెప్పారు. తాను చూసిన వక్తుల్లో ఆయన చాలా ధైర్యవంతుడని కితాబిచ్చారు.
ఇదిలా ఉండగా జులైలోనూ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకువెళ్లింది. అప్పుడు ఆయన వెంట్రుకవాసిలో మృత్యువును తప్పించుకున్నారు.