ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. ఆగ్రా-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇటావా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఇటావా ఎమ్మెల్యే సరితా భదోరియా కూడా హాజరయ్యారు. పచ్చజెండా ఊపి రైలు ప్రారంభించడానికి ఆమె అక్కడికి వచ్చారు. అయితే ఆ కార్యక్రమాలనికి ఆమెతోపాటు ఇతర బీజేపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. జనాలు ఎక్కువగా ఉండటంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆమె పచ్చ జెండా ఊపబోయి రైల్వే ఫాట్‌ఫామ్ నుంచి అమాంతం పట్టాలపై పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
రైలును ఫ్లాగ్ ఆఫ్ చేసే కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు ఇటావా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లో భారీ రద్దీ నెలకొంది. సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి ప్లాట్‌ఫారమ్ వద్ద పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూగారు. అయితే అక్కడి పరిస్థితి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేక పోయారు. కొద్ది నిమిషాల పాటు అదుపు తప్పి తోపులాట జరిగింది. ఎమ్మెల్యే ప్లాట్‌ఫారమ్‌పై నుంచి కిందపడినప్పుడు వెనుక ఓ పోలీసు నిలబడి ఉండటం వీడియో కనిపిస్తుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరడానికి ముందు ఇది జరిగింది. మహిళా ఎమ్మెల్యే సరిగా భదోరియా రైల్వే ట్రాక్‌పై పడిపోవడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ట్రాక్ క్లియర్ చేసేందుకు వందేభారత్ హారన్ మోగించడం వీడియోలో వినవచ్చు.