ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్స్ అంశం చూస్తే ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నామని హోం మినిస్టర్ అనిత వ్యాఖ్యలు చేశారు.మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మొదట ఒకొక్క బోట్ బరువు 40 టన్నులు అనుకున్నాము కానీ ఆ బోట్లు 80 టన్నులు వరకు ఉందని తెలిపారు. ఈ మూడు బోట్స్ ఒకదానితో ఒకటి ఇనుప రోప్స్‌తో కలిపి ఉన్నాయన్నారు. ఈ బోట్స్ వైసీపీకి చెందిన అనుచరులవే అని స్పష్టం చేశారు.గత ప్రభుత్వం ఇసుక మాఫియా చేసిందని మండిపడ్డారు. సీఎంతో సహా పూర్తి మంత్రి వర్గం, మొత్తం అధికార యంత్రాంగం అందరూ కలసి ఈ బోట్స్‌ను తీస్తామని తెలిపారు. బోట్స్ అంశం కేసు విచారణ వేగంగా జరుగుతోందన్నారు. బోట్స్ వాటికంత అవే కొట్టుకు రావా అని కొందరు అంటున్నారని.. ఎలా వస్తాయని ప్రశ్నిస్తూ.. వీరు ఉగ్రవాదుల కంటే చాలా డేంజర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారు కాబట్టే చాలా విపత్కర పరిస్థితి నుండి బయట పడగలిగారన్నారు. కౌంటర్ వెయిట్ ఇరిగిపోయాయి కానీ పిల్లర్లు ఇరిగి ఉంటే.. చాలా ఘోరం చూసేవాళ్ళమని తెలిపారు. రాజకీయాలు కాదు.. నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏది ఏమైనా సరే బోట్స్ బయటకు తీసి తీరుతామని స్పష్టం చేశారు.ముంబై నటి జెత్వానీ కేసులో విచారణ కొనసాగుతోందని... ఐపీఎస్‌ల వెనక ఎంత పెద్దవారు ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. వీరి వలన చాలామంది బలైపోయారన్నారు. విచారణలో వెలుగు చూసినా ఆధారాల మేరకే ఐపీఎస్‌లను సస్పెన్షన్ చేయటం జరిగిందని వెల్లడించారు. సలహాదారులు సూత్రధారులు ఎవరన్నా కానీ వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.