ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం మరో పథకం పేరును మార్చింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన అనేక పథకాల పేర్లను మార్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాజాగా మరో పథకం పేరును మార్చింది. వైసీపీ హయాంలో తెచ్చిన శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం పేరును ఏపీ ప్రభుత్వం మార్చింది. ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా ఈ పథకం పేరును మార్చారు. ఈ మేరకు ఏపీ రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. నూతన మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించి మంత్రి ఉప సంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. వివిధ రాష్ట్రాలలో అనుసరిస్తున్న మద్యం విధానాలను ఈ సందర్భంగా మంత్రులు చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది.
గ్రామాల్లో భూ వివాదాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఇక పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర రీ సర్వే ప్రారంభించారు. అయితే పథకం అమల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ గతంలో విపక్షంగా ఉన్న టీడీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని ప్రక్షాళన చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక చెప్పిన ప్రకారమే శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకం పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఇక పథకం అమల్లో కూడా తప్పులు లేకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
మరోవైపు నూతన మద్యం విధానంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాత మద్యం విధానం గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమలు చేయాల్సి ఉంది. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఇప్పటికే ఓ సారి భేటీ అయ్యి.. నూతన మద్యం విధానంపై చర్చించింది. అలాగే మద్యం పాలసీ రూపకల్పనపై అధికారులు సమర్పించిన నివేదికను కూడా పరిశీలించింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం పాలసీపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎక్సైజ్ అధికారులు సమర్పించిన నివేదికను చంద్రబాబుకు మంత్రులు వివరించినట్లు తెలిసింది.ఏదేమైనా అక్టోబర్ నుంచి నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది.