ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నీరు చెట్టు పథకం బిల్లులను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌లతో చంద్రబాబు చర్చించారు. 2014-19 సమయంలో నీరు చెట్టు పథకం పెండింగ్ బకాయిల గురించి వారితో చర్చించారు. అనంతరం పెండింగ్ బిల్లులకు నిధులను దశల వారీగా నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖను చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందులో భాగంగా తొలి విడతలో రూ.259 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సూచించారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అంటే.. 2014-19 మధ్య నీరు చెట్టు పథకం కింద అనేక పనులు చేపట్టారు. చెరువుల్లో పూడికతీత పనులు, చెరువుల అభివృద్ధి వంటి పనులు చేశారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ సర్కారు నవరత్నాల అమలుకు పెద్దపీట వేయటంతో నీరు చెట్టు పథకానికి బిల్లుల చెల్లింపులను పట్టించుకోలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే అ పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. ఇక 2024 ఎన్నికల తర్వాత టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో నీరు- చెట్టు పెండింగ్ బిల్లులకు మోక్షం లభించింది. నీరు - చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ఓటాన్ అకౌంట్‌లో నిధులు కేటాయించారు.
ఇక బిల్లుల చెల్లింపుల కోసం ఏపీ జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ప్రాధాన్యాలను సైతం నిర్దేశించారు. పెండింగ్ బకాయిలపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన బిల్లులను తొలుత అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత రిట్ పిటిషన్లలో హైకోర్టు తుది తీర్పు వెలువరించినవి రెండో దశలో సమర్పించాలని.. ఇక మూడో విడతలో రిట్ పిటిషన్లు దాఖలైన వాటికి సంబంధించిన బిల్లులను అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. నీరు చెట్టు పథకం బకాయిలపై కోర్టుల్లో ఉన్న అన్ని కేసులకు సంబంధించి 427 కోట్ల వరకూ చెల్లింపులు చేయాల్సి ఉంది. అలాగే ఇంజనీరింగ్ విభాగాల వద్ద మరో 404 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిసింది. అయితే వీటిలో తొలివిడతగా 259 కోట్లు చెల్లించనున్నారు.