విజయవాడను వరద ముంచెత్తడంతో.. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఈ క్రమంలో సర్టిఫికేట్లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు నీళ్లలో నానిపోయిన పరిస్థితి. ఈ వరదలతో ఆస్తి నష్టంతో పాటుగా ఇళ్లలో దాచుకున్న ముఖ్యమైన పత్రాలన్నీ వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏళ్ల నాటి ఇళ్ల, పొలాల దస్తావేజులు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్ పుస్తకాలు, రేషన్, ఆధార్ కార్డులు.. మరీ ముఖ్యంగా విద్యార్థుల సర్టిఫికెట్లు, మార్కుల లిస్టులు కూడా వరదలో కొట్టుకుపోయాయి, కొన్ని నానిపోయిన పరిస్థితి. అలాగే ఇన్సూరెన్స్ పేపర్లది కూడా అదే పరిస్థితి. సర్టిఫికేట్లు నీటమునగడంతో.. కొన్నిటిని తీసి ఎండలో ఆరబెడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఇంటర్వ్యూకు వెళ్లాలన్నా కనీసం ఒక్క సర్టిఫికెట్ కూడా సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభుత్వం చొరవ చూపి..సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ క్రమంలో మంత్రి నారాయణ స్పందించారు. వరదల్లో నష్టపోయిన సర్టిఫికెట్లను, ఇంటి దస్తావేజులను, వివిధ రకాల కార్డ్ను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసి ఉచితంగా ఇస్తామని మంత్రి తెలిపారు. విజయవాడలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని .. మూడు డివిజన్ల పరిధిలోని 10 వీధుల్లో ఇంకా వరద నీరు ఉందని మంత్రి నారాయణ చెప్పారు. కాకపోతే మరికొన్ని ఇళ్లల్లో చాలా బురద ఉందన్నారు.. వెంటనే ఫైర్ ఇంజిన్లతో క్లీనింగ్ కొనసాగుతుందన్నారు. డ్రైనేజీల్లో ఉన్న సిల్ట్ తొలగింపు ప్రక్రియ నడుస్తోందని.. వరద నీరు ఉన్న ప్రాంతాలతోపాటు శానిటేషన్ పనులు కూడా జరుగుతున్నాయన్నారు. జర్నలిస్టు కాలనీలో వరద నీటిని భారీ మోటార్లతో బయటికి పంపింగ్ చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్టులు నిర్మిస్తామని చెప్పారు మంత్రి.
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే మెుదటి విడత వరద నష్టం అంచనా ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు. అలాగే వరదల వల్ల 33 వేల ఇళ్లు, 36 వేల ద్విచక్రవాహనాలు పాడయ్యాయి. వరద బాధితుల సహాయం కోసం బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఇప్పటికే మాట్లాడారు. పాడైన ఇళ్లు, వాహనాలకు సంబంధించి డేటా సేకరణ పూర్తికాగానే.. దేనికెంత ఇవ్వాలనేది ఒక నిర్ణయానికి వస్తారు. మరోవైపు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటమునిగిన బైకుల్ని కొందరు మెకానిక్‌లు ఉచితంగా రిపేర్లు చేస్తున్నారు. విజయవాడ వరద బాధితుల పరిస్థితి చూసి తాము ఉచితంగా రిపేర్లు చేయాలని నిర్ణయించినట్లు మెకానిక్‌లు చెబుతున్నారు. ఎంతోమంది తమకు తోచిన విధంగా ఇలా సాయం చేస్తున్నారు.