విశాఖపట్నం నుంచి మరో వందేభారత్ రైలు పట్టాలెక్కింది. విశాఖపట్నం-దర్గ్ (రాయపూర్) మధ్య ఈ రైలు ప్రారంభంకాగా.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తుంది.. గురువారం మాత్రం బ్రేక్ ఉంటుంది. ఈ వందేభారత్ ఏపీలోని పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నంలో మాత్రమే ఆగుతుంది. అయితే తాజాగా ఏపీలో మరో స్టేషన్‌లో హాల్ట్ దిశగా అడుగులుపడుతున్నాయి. ఈ మేరకు స్థానిక ఎంపీకి స్థానికులు రిక్వెస్ట్ చేయగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం రావడం అదృష్టమని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పనాయుడు అన్నారు. విశాఖపట్నం నుంచి దుర్గ్ (రాయ్‌పూర్)కు ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం చేరుకున్నాక ఎంపీతో పాటు కలెక్టర్, ఎచ్చెర్ల శాసనసభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్.ఈశ్వరరావు స్వాగతం పలికారు. ఎంపీ కలిశెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించారు.. రాయగడ వరకు వెళ్లారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వందేభారత్ రైలు విజయనగరం జిల్లా మీదుగా వెళ్లడం వల్ల ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందన్నారు. అలాగే ఈ రైలును బొబ్బిలిలో కూడా నిలిపేలా రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తే విమానంలో వెళ్తున్న అనుభూతి కలుగుతోందని.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 4
ఈ రైళ్లను రూపొందించారన్నారు.
విశాఖ- దుర్గ్ వందేభారత్ రైలు బొబ్బిలిలో ఆగేలా చూడాలని శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడును కలిసి ఎమ్మెల్యే బేబినాయన వినతిపత్రం అందించారు. బొబ్బిలిలో పారిశ్రామికవాడ, ఇతర వ్యాపార వర్గాల వారు, విద్యాసంస్థలు ఉన్నాయని.. వారంతా రాయపూర్, ఛత్తీస్‌గఢ్‌కు పనులపై వెళ్తుంటారన్నారు. ఇదే విషయాన్నికేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రైల్వే డీఆర్‌ఎం దృష్టికి కూడా సమస్య తీసుకెళ్లినట్లు వివరించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును కూడా కలిసి బొబ్బిలిలో రైలు ఆగేలా చూడాలని కోరగానే ఆయన డీఆర్‌ఎంతో మాట్లాడారన్నారు. ప్రస్తుతానికి ఈ వందేభారత్ రైలు బొబ్బిలిలో ఆగకపోయినా భవిష్యత్తులో ఆగేలా చర్యలు తీసుకుంటామని తనతో చెప్పారన్నారు.
విజయనగరం జిల్లా ప్రయాణికులకు సౌకర్యవంతమైన వందేభారత్ రైలును ప్రారంభించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఇక్కడి వారి తరఫున జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిలో విశాఖ నుంచి రెండు వందే భారత్‌లను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు.
వాస్తవానికి ఈ విశాఖపట్నం-దుర్గ్ వందేభారత్ రైలుకు.. ఏపీలోని విజయనగరం, విశాఖపట్నంలో మాత్రమే హాల్ట్ ఉంది. అయితే పార్వతీపురంలోకూడా స్టాప్ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే రైల్వేమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేశారు.. దీంతో పార్వతీపురంలో కూడా హాల్ట్ కేటాయించారు. అయితే తాజాగా బొబ్బిలిలో కూడా రైలు ఆగేలా చూడాలని స్థానికులు కూడా కోరుతున్నారు.. తమకు ఉపయోగకరంగా ఉంటుందని.. తమ వినతిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. అలాగే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా రైల్వేమంత్రిని రిక్వెస్ట్ చేస్తానని చెప్పడంతో బొబ్బిలి స్టేషన్‌లో కూడా వందేభారత్ హాల్ట్ ఇస్తారని భావిస్తున్నారు. బొబ్బిలిలో కూడా ఈ రైలు ఆగితే.. అప్పుడు రాష్ట్రంలో నాలుగు స్టేషన్‌లలో ఈ రైలు ఆగుతుంది. అప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా, ఛత్తీస్‌గడ్ వెళ్లే ప్రయాణికులకు కనెక్టవిటీ పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై రైల్వేశాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.