ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. లిక్కర్ పాలసీలో తనపై ఆరోపణలు వచ్చినప్పుడే రాజీనామా చేయాల్సిందని ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్‌కు నైతికత ఉంటే ముందే రాజీనామా చేసి ఉండేవారన్నారు. కేసులో నిజానిజాలు తేలే వరకు కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సిందని పేర్కొన్నారు. కానీ ఆయన అలా చేయలేదని విమర్శించారు.
ఇప్పుడు కేజ్రీవాల్ ప్రజా న్యాయ స్థానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. విదేశాలకు వెళ్లిన రాహుల్ గాంధీ భారత్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, అయినా ప్రజల్లో మోడీ సర్కార్‌పై విశ్వాసం పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు.