టీడీపీ నేత బుద్దా వెంకన్న కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్ర పటానికి టీడీపీ కార్యకర్తలు, వరద బాధితులు పూలాభిషేకం చేశారు. విపత్తులో వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సేవలు ఆదర్శనీయం అంటూ వరద బాధితులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మా బాబు బంగారం’’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. విపత్తు సమయంలో బాధితులకు సహాయక చర్యలు చేపట్టిన చంద్రబాబు పని తీరు ఆదర్శమన్నారు. ఇప్పుడు వరద బాధితులకు 25 వేల రూపాయలు సాయం అందిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా ఈ తరహాలో సాయం అందించిన సీఎం ఎవరూ లేరని తెలిపారు. ప్రజల మధ్య ఉంటూ నిద్రాహారాలు మాని పని చేసిన సీఎం చంద్రబాబు అని కొనియాడారు. విజయవాడ, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు రుణపడి ఉన్నారన్నారు. దీనిని కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గత ఐదేళ్లల్లోప్రజల పాట్లు జగన్ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూడా వరద రాజకీయం చేయడానికి నవ్వుతూ వచ్చి ప్రజల్లో నవ్వుల పాలయ్యారన్నారు. కోటి రూపాయలు జగన్ ఎవరికి ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. విపత్తుల్లో ప్రజలను ఆదుకోకపోగా కుట్రలు చేశారని మండిపడ్డారు. ప్రజలంతా చంద్రబాబు పడిన కష్టం చూసి చలించారన్నారు. చంద్రబాబుకు పుష్పాభిషేకాలు, పాలాభిషేకాలు ప్రజలే స్వచ్చందంగా చేస్తున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.