తెలుగుదేశం అధినేత చంద్రబాబు సారథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాలక కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం మంగళగిరి, డీజీపీ కార్యాలయం సమీపంలోని సీకే సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుందని వెల్లడించాయి. మరోవైపు ఈ రోజు ఉదయం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కానున్నారు. వంద రోజుల సందర్భంగా ఎమ్మెల్యేలకు వారి పనితీరుపై ప్రోగ్రెస్ కార్డులు తయారుచేసి ఎవరికి వారికి విడిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత భావించారు. సమయానికి అవి సిద్ధమైతే ఇవ్వాలని, లేని పక్షంలో తర్వాత ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇంకోవైపు.. మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జులు, వైసీపీ గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది.