కాకినాడలోని జీజీహెచ్‌లో అరుదైన సర్జరీ జరిగింది. ఓ మహిళా రోగి అదుర్స్ సినిమా చూస్తుండగా బ్రైయిన్ సర్జరీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందరం కామెడీ సీన్స్ చూస్తుండగానే అంతా పూర్తయ్యింది. తొండంగి మండలం ఎ కొత్తపల్లికి చెందిన అనంతలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె కొంతకాలంగా కుడికాలు, కుడిచేయి లాగుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు.. అయితే వైద్యం చేయాలంటే చాలా ఖర్చవుతుందని.. వ్యాధి నయం కావడం కష్టమన్నారు డాక్టర్లు.
అనంతలక్ష్మికి ఈనెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోయాయి.. వెంటనే ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి మెదడులో ఎడమవైపు కణితి (3.3×2.7 సెం.మీ.ల) ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి దానిని తొలగించాలని నిర్ణయించారు. మంగళవారం అనంతలక్ష్మికి అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే సర్జరీ చేసి ఆ కణితిని తొలగించారు. ఆమె మెలుకువగా ఉండేందుకు.. అదుర్స్ సినిమా చూపిస్తూ.. ఆమె ఆనందంలో ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఈ సర్జరీ చేశారు డాక్టర్లు.
సర్జరీ తర్వాత అనంతలక్ష్మి లేచి కుర్చున్నారని, అల్పాహారం తీసుకున్నారని డాక్టర్లు తెలిపారు. జీజీహెచ్‌లో మొదటిసారిగా ఈ తరహా సర్జరీ చేశామని.. మరో ఐదు రోజుల్లో ఆమెను డిశ్ఛార్జి చేస్తామన్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు న్యూరోసర్జరీ సీనియర్ డాక్టర్లు, మత్తు డాక్టర్ల పర్యవేక్షణలో జరిగింది. సర్జరీ చేసే సమయంలో డాక్టర్లు అడిగే ప్రశ్నలకు రోగులు సమాధానాలు చెబుతుంటారు.. అప్పుడు వారి ఇబ్బందులు తెలుసుకుంటూ ముందుకు సాగవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అనంతలక్ష్మి కుటుంబసభ్యులు వైద్యబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.