లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా జరిగిన పేజర్ పేలుళ్ల వెనుక ఇజ్రాయేల్ పక్కా ప్రణాళిక ఉన్నట్టు భావిస్తున్నారు. మొత్తం 5 వేలకు పైగా పేజర్లు పేలిన ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయేల్ గూఢచర్య సంస్థ మొసాద్ (Mossad) పక్కా ప్లానింగ్‌తో ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. పేలిపోయిన పేజర్లు తైవాన్‌లో తయారుకాగా.. కొద్ది నెలల కిందటే హెజ్బొల్లా గ్రూప్ ఆర్డర్ చేసిందని లెబనాన్‌కు చెందిన భద్రతా వర్గాలు రాయిటర్స్‌కు వివరించాయి. ఈ ఆపరేషన్ కోసం మొసాద్ కొద్ది నెలలుగా కార్యాచరణ చేపట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని కొన్ని అంతర్జాతీయ కథనాల్లో పేర్కొన్నారు.
హెజ్బొల్లాను దెబ్బతీయడానికి మొసాద్ పక్కాగా ప్లాన్ చేసి నిర్వహించిన ఆపరేషన్ ఇదని సెక్యూరిటీ సంస్థలు చెబుతున్నాయి. కొంతకాలంగా పేజర్ల ద్వారానే హెజ్బొల్లా సభ్యుల మధ్య సమాచార మార్పిడి జరుగుతోంది. మొబైల్ ఫోన్లు వాడొద్దని, ఇజ్రాయేల్ నిఘా సంస్థలు ట్రాప్ చేసే అవకాశం ఉందని తన సభ్యులకు హెజ్బొల్లా చీఫ్ గతంలో హెచ్చరించారు. దీంతో ఆ గ్రూప్ పేజర్లపైనే ఆధారపడుతోంది. ఇటీవల తైవాన్ నుంచి 5 వేల పేజర్లను కొనుగోలు చేసి సభ్యులకు అందజేసింది. ఇక్కడే ఇజ్రాయేల్ గూఢచర్య సంస్థ కుట్ర చేసినట్లు తెలుస్తోంది.
పేజర్ల కొనుగోలు విషయం ముందే ఊహించిన మొసాద్.. కొన్ని నెలల ముందే వాటిలో పేలుడు పదార్థాలను చేర్చి.. బాంబులుగా మార్చింది. ఒక్కోదాంట్లో 3 గ్రాముల శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని ఉంచినట్టు గుర్తించారు. మొసాద్ తన ప్లాన్‌ను కచ్చితంగా అమలుచేసింది. వారు అనుకున్నట్టే అవి హెజ్బొల్లా సభ్యుల చేతుల్లోకి వెళ్లాయి. మంగళవారం ఆపేజర్లను పేలిపోయేలా చేసి శత్రువుకు తెలియకుండానే దెబ్బకొట్టింది ఇజ్రాయేల్.
పేజర్ల కోసం తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీకి హెజ్బొల్లా ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం 5 వేల పేజర్లను ఆ సంస్థ డెలివరీ చేసింది. పేలుళ్ల నేపథ్యంలో ఆ పేజర్ల తయారీ గురించి నిఘా వర్గాలు ఆరా తీయడం మొదలుపెట్టాయి.
పేజర్ల పేలుడు నేపథ్యలో గోల్డ్ అపోలో కంపెనీ వ్యవస్థాపకుడు హుసు చింగ్ కువాంగ్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. పేలిపోయిన ఆ పేజర్లు తమ కంపెనీలో తయారు కాలేదని పేర్కొన్నారు. ఐరోపాలోని ఓ కంపెనీ వాటిని తయారు చేసిచ్చిందని, వాటిపై తమ కంపెనీ పేరు మాత్రమే ముద్రించి డెలివరీ చేశామని తెలిపారు. ఆ పేజర్లపై పేరు తప్ప మిగతా పరికరాలు వేటితోనూ తమ కంపెనీకి ఎలాంటి సంబంధంలేదని వివరణ ఇచ్చారు.
పేలిపోయిన పేజర్లను ఏపీ 924 మోడల్‌గా గుర్తించినట్టు లెబనాన్ భద్రతా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవి సాధారణ పేజర్ల మాదిరిగానే సందేశాలను అందుకుంటుందని, ఫోన్ కాల్ చేయడం కుదరదని చెప్పాయి. కానీ, వీటిని తయారీ సమయంలో మొసాద్ పేలుడు పదార్థాలు అమర్చి మార్పులు చేసిందని వ్యాఖ్యానించాయి.
‘పరికరం లోపల ఒక కోడ్‌ను స్వీకరించే పేలుడు పదార్థాన్ని కలిగి ఉన్న బోర్డును అమర్చింది. స్కానర్ లేదా ఇతర పరికరంతో ఏవిధంగానైనా దీనిని గుర్తించడం చాలా కష్టం. సిగ్నల్ పంపించడం ద్వారా, లేదా ఓ ప్రోగ్రామింగ్ కోడ్ ద్వారా ఇవి అధికంగా వేడెక్కేలా చేయడం ద్వారా పేలుళ్లకు పాల్పడ్డారు’ అని లెబనార్ అధికార వర్గాలు తెలిపాయి.
ఇజ్రాయెల్‌లో పేజర్ల పేలుడు నేపథ్యంలో వీటి గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. దీంతో పేజర్ గూగుల్ టాప్ ట్రెండ్స్‌లో నిలిచింది. భారత్‌లో జమ్మూ కాశ్మీర్‌లో దీని గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. ఆ తర్వాత నాగాలాండ్, కేరళ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో పేజర్ల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు.