ప్రజలకు మనకు అనూహ్యమైన విజయాన్ని అందించారు. 93 శాతం స్ర్టైక్ రేట్ సాధించాం. ప్రజల ఆకాంక్ష ఈ విజయంలో మిళితమై ఉంది. ఈ విషయం మనం గమనించాలి. వైసీపీ చేసిన తప్పులు మనం చేయొద్దు’’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వంద రోజులు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధుల ఉమ్మడి సమావేశంలో బుధవారం ఆమె మాట్లాడారు. ‘‘అభివృద్ధి అనే మాటకు అర్థంలేకుండా.. పెట్టుబడులు రాకుండా.. మన బిడ్డలకు ఉపాధి అవకాశాల్లేని, విద్వేష పూరిత, అరాచక పాలన రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ప్రజలు చూశారు. అట్రాసిటీ కేసులు, మహిళలపై అత్యాచారాలు, నాసిరకం మద్యంతో మహిళల పుస్తెలు తెంపడం.. లాంటి చర్యలతో విసిగి పోయారు. ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించారు. పాలనా దక్షత ఉన్న చంద్రబాబు, ధైర్యంతో ముందుకెళ్లే పవన్ కల్యాణ్, అవినీతికి తావులేని నిస్వార్థ సేవ మోదీ సొంతం. అందుకే మూడు పార్టీలను ప్రజలు దీవించారు. గత ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, రాష్ట్రాన్ని ధ్వంసం చేయడాన్ని గుర్తుంచుకుని మనం ఏమి చేయకూడదో జాగ్రత్త పడాలి. కేంద్రం విపత్తులకు ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వ సొంతం. రాష్ట్రానికి సహకరించేందుకు కేంద్రం ముందుకొస్తోంది. పోలవరం, అమరావతి ఇతరత్రా అభివృద్ధికి నిధులు ఇస్తోంది. ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా, మూడు పార్టీల కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వంద రోజుల్లో ఏమి చేశామన్నది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.