ఒక భారీ ట్యాంకర్ వచ్చి రోడ్డుపై ఆగింది. డ్రైనేజీ క్లీనింగ్ కోసం మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఆ ట్యాంకర్‌ను హఠాత్తుగా భూమి మింగేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అదేంటీ ట్యాంకర్‌ను భూమి ఎలా మింగుతుంది అని ఆశ్చర్యపోతున్నారా. అదే ఇక్కడ విషయం మరి. అప్పటివరకు అక్కడ ఆగి ఉన్న ఆ ట్యాంకర్ ఒక్కసారిగా భూమిలోకి దిగబడిపోయింది. మొదట ట్యాంకర్ వెనక టైర్లు కుంగగా.. ఆ తర్వాత క్రమంగా ఆ ట్యాంకర్ వెనక నుంచి అందులో పడిపోయింది. పూర్తిగా ఆ గుంతలోకి చేరిపోయింది. అది గమనించిన ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి.. బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ కావడంతో మహారాష్ట్రలోని పూణె నగరంలో జరిగిన ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రోడ్డుపైన గుంతల్లో వాహనాలు కూరుకుపోయిన దృశ్యాలు చాలానే చూసుంటారు. కానీ, ఈ వీడియో చూశారా.. ఏకంగా వాహనం వాహనమే గుంతలో కూరుకుపోయింది. పూణేలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుంతలో ట్యాంకర్ కూరుకుపోవడానికి కొన్ని క్షణాల ముందే అక్కడ నుంచి కొంత మంది నడుచుకుంటూ వెళ్లిపోవడం వీడియోలో చూడవచ్చు. అకస్మాత్తుగా భారీ గొయ్యి ఏర్పడటం, ట్యాంకర్ అందులో కూరుకుపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ గొయ్యిలో మురుగు నీరు ఉండగా.. దాదాపుగా ట్యాంకర్ క్యాబిన్ వరకు ఆ మురుగు నీటిలో మునిగిపోయింది.
ట్యాంకర్ డ్రైవర్ చివరి నిమిషంలో బయటకు దూకాడు. ఓ వ్యక్తి సాహసోపేతంగా గొయ్యి వద్దకు వెళ్లి, డ్రైవర్‌కు సాయం అందించాడు. అయితే, ట్యాంకర్ క్యాబిన్ భాగం మునగిపోకపోవడంతోనే డ్రైవర్ సురక్షితంగా బయటపడగలిగాడు. పూణే మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన ఆ ట్యాంకర్.. బుద్వార్ పెత్ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ప్రాంగణంలో డ్రైనేజ్ క్లీనింగ్ వర్క్ నిమిత్తం వచ్చింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పూణే మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. అయితే, అక్కడ ఫ్లోర్ ఒక్కసారిగా ఎందుకు కుంగిపోయింది అని ఆరా తీయగా.. గతంలో అక్కడ బావి ఉండేదని ఓ అధికారి వెల్లడించారు. పాత బావికి స్లాబ్ వేసి.. దానిపై పేవర్ బ్లాక్స్ వేశారని చెప్పారు. అయితే, డ్రైనేజీ వెహికల్ హెవీగా ఉండడంతో స్లాబ్ కూలిపోయి బావిలో ఆ వెహికల్ పడిపోయిందన్నారు. రెండు క్రేన్ల సాయంతో ట్యాంకర్‌ను బయటికి తీశామని తెలిపారు.
అయితే, ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే.. ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 20 మంది సిబ్బంది అక్కడకు చేరుకొని పరిశీలించారు. రెండు క్రేన్ల సాయంతో ట్యాంకర్‌ను బయటికి తీశారు.