టీడీపీ కేంద్ర కార్యాలయంలో సందర్శకుల నుంచి వినతులు తీసుకునేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమో! ఆ దేవుడు నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో....మనం నిమిత్త మాత్రులం.....దేవుడే అన్నీ చేయిస్తాడు... ఇదీ అంతే అనుకుంటున్నా" అని వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి లడ్డు కంటే బాగా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాలేదు. వందల ఏళ్లుగా శ్రీవారి లడ్డూ అక్కడ తయారవుతోంది. అయోధ్యలో కూడా తిరుమల లాంటి లడ్డూ తయారు చేయాలని చూశారు. ఇక్కడ నుంచి కార్మికులను తీసుకువెళ్లారు. కానీ సాధ్యం కాలేదు. ఈ విషయం నాకు అక్కడి వారే చెప్పారు. అంత మహత్మ్యం ఉన్న ప్రసాదం అది.గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయి. రామతీర్థంలో రాములవారి విగ్రహ తల తొలిగిస్తే దిక్కులేదు... కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలా ఒకటని కాదు... నాటి ప్రభుత్వం చెయ్యని తప్పులేదు. నాడు ప్రజల సెంటిమెంట్ తో ఆడుకున్నారు. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదు. పోలవరం, అమరావతి నాశనం చేసి... ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేసి తప్పుడు ప్రచారం చేశారు. బాబాయి హత్య విషయంలో ఎలా బుకాయించారో... నేడు ప్రకాశం బ్యారేజ్ కు బోట్ల విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు నేరాలు చేసి....ఎదురుదాడి, బుకాయింపు, ఫేక్ ప్రచారం అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు తప్ప... బాధ్యత అనేది లేదు. అందుకే వీళ్లను కొలంబియా నేరస్తుడు, మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చాను.కేరళ గురువాయూర్ టెంపుల్ లో దర్శనానికి చొక్కా విప్పి వెళ్లాలి.....అది సాంప్రదాయం. అందరూ పాటించాలి. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరు గౌరవించాలి. గతంలో వైఎస్ ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నాడు... అప్పుడు వ్యతిరేకించాం, పోరాడాం. అమరావతిలో రూ.250 కోట్లతో శ్రీవారి టెంపుల్ కడదాం అనుకుంటే దాన్ని కుదించారు. వీళ్లు మళ్లీ ఇప్పుడు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు" అంటూ చంద్రబాబు మండిపడ్డారు.