తిరుపతి లడ్డూ తయారీ గురించి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తాజాగా మరిన్ని విషయాలు వెల్లడించారు. శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారాన్ని ఆయనే తనతో చెప్పించారని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందని తెలిపారు. ఇక నుంచి భవిష్యత్తులో ఇలాంటి కల్తీ ఘటనలు జరగకుండా.. తప్పు చేసినవారిని కఠినంగా శిక్షిస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఈ విషయం విని తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారని వెల్లడించారు. మరోవైపు.. తిరుమలలో జరిగిన ఇంతటి భారీ అపచారానికి సంబంధించి వివిధ వర్గాల వారితో మాట్లాడనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం తప్పులు, పాపాలు చేసి మళ్లీ ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
తిరుమల ఆలయాన్ని సంప్రోక్షణ చేయడం గురించి జీయర్లు, కంచి పీఠాధిపతులు, ఇతర ధర్మాచార్యులు, పండితులతో మాట్లాడతామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. జగన్ హయాంలో రాముడి విగ్రహం తల తీసేసినా, ఆలయాలపై దాడి చేసినా పట్టించుకునే వారే లేకుండా పోయారని మండిపడ్డారు. తప్పులు, పాపాలు చేసి.. మళ్లీ సిగ్గు లేకుండా జగన్ వాటిని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భాగం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీలో నాణ్యతను పరీక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు.
తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాణ్యతపై ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్ట్‌పై సమాధానం చెప్పకుండా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు వైసీపీ చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. నాణ్యమైన ఆవు నెయ్యి రూ.320కే కిలో ఎవరిస్తారని సీఎం ప్రశ్నించారు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టే లడ్డూ తయారీలోనూ రివర్స్ టెండర్లా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తిరుమలలో ల్యాబ్ లేకుండా పరీక్షలు ఎలా చేయించారని నిలదీశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో భక్తి, భయం లేకుండా పోయాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమలలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోకు చెప్పానని.. ఆయన అనేక చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం లడ్డూ నాణ్యతను పెంచారని.. పలువురు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు వెల్లడించారు. ప్రసాదాల తయారీ కోసం ఉపయోగించే ముడిసరుకు కొనుగోలు కోసం కొత్త టెండర్లు పిలిచినట్లు చంద్రబాబు తెలిపారు.
ఇక తిరుమల ప్రసాదంపై మంత్రులు, అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకంపై టీటీడీ ఈవో శ్యామలరావు చంద్రబాబుకు నివేదిక అందించారు. ఆలయ సంప్రోక్షణపై వచ్చిన పలు సూచనలను ముఖ్యమంత్రికి వివరించారు. మరిన్ని సంప్రదింపులు జరిగాకే సంప్రోక్షణ చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. ఇతర మతానికి చెందిన ప్రార్థనా మందిరాల్లోనూ కచ్చితంగా అదే వర్గానికి చెందిన వారిని సిబ్బంది ఉండేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.