గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీ, అందులో వాడే పదార్థాలపై.. ప్రభుత్వం దృష్టి సారించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నాణ్యమైన ప్రసాదాలు అందించడమే లక్ష్యంగా అన్ని ఆలయాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ఆలయాల్లో ప్రసాదాల తయారీకి ఉపయోగించే పదార్థాలను టెస్ట్‌లకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే ప్రముఖ ఆలయం అయిన విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో తాజాగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా నెయ్యిని సీజ్ చేసి.. టెస్ట్‌ల కోసం పంపించారు.
సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో తయారు చేసే ప్రసాదం తయారీకి ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచిన 945 కిలోల నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. అనంతరం నెయ్యి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. కేవలం నెయ్యి మాత్రమే కాకుండా ప్రసాదంలో వాడే ఇతర పదార్థాలను కూడా టెస్ట్‌ల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు చెప్పారు. ఏలూరు జిల్లా రైతు డెయిరీ నుంచి సింహాచలం అప్పన్న ఆలయానికి నెయ్యి సరఫరా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక శనివారం సింహాచలం అప్పన్న ఆలయాన్ని సందర్శించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం నెయ్యిని సీజ్ చేశామని.. పూర్తి నివేదిక వచ్చిన తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆహార భద్రత అధికారి అప్పారావు తెలిపారు.
సింహాచలం దేవస్థానంలో భక్తుల రద్దీని బట్టి రోజుకు 25 వేల నుంచి 30 వేల లడ్డూలు తయారు చేస్తారు. రోజుకు 24 కిలోల నెయ్యిని ఉపయోగిస్తారు. అయితే 3ఏళ్ల కింది నుంచి లడ్డూ నాణ్యతలో చాలా మార్పులు వచ్చాయని కొందరు భక్తులు చెబుతున్నారు. వనస్పతి వాసన రావడం, జిగటగా ఉండడం, తయారు చేసిన ఒకట్రెండు రోజుల తర్వాత వాసన రావడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 2019 నుంచి 2021 వరకు రూ.591లకు కిలో నెయ్యి కొనుగోలు చేసిన సింహాచలం దేవస్థానం.. 2022లో ఒక్కసారిగా కిలో రూ.393లకు.. 2024లో రూ.344కి కొనుగోలు చేసింది. ఏటా నెయ్యి రేటు తగ్గడం వెనుక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.