ఏపీ సీఎం చంద్రబాబు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, గ్రామ స్థాయి టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని, కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, వారి త్యాగాలు చిరస్మరణీయం అని కొనియాడారు. కార్యకర్తలకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచామని వెల్లడించారు. పార్టీ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంపవర్‌మెంట్ విభాగం ద్వారా యువతకు వివిధ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ద్వారా విద్యార్థులకు శిక్షణను ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని వివరించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తామని తెలిపారు.