తాజ్ మహల్ అద్భుత కట్టడం. కానీ గత కొన్ని రోజులుగా ఆ అద్భుత కట్టం పరిస్థితి చూస్తుంటే తాజ్ లవర్స్‌కు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఇటీవల ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీరు లీక్ కావడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. తాజాగా తాజ్ మహల్‌పై పగుళ్లు కనిపించాయి. తాజ్ మహల్ గోడలు, కింది భాగంలోని అంచుల వద్ద కూడా కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. వీటితోపాటు ప్రధాన డోమ్‌కు వద్ద కూడా ఒక మొక్క మొలిచింది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది.
గతవారంలో తాజ్ మహల్ పరిసరాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు ప్రధాన డోమ్‌లో నుంచి వర్షం నీళ్లు లీక్ కావడంతోపాటు వరద ఉద్ధృతికి యమునా నది తాజ్ మహల్ గోడను తాకుతూ ప్రవహించింది. అంతేకాకుండా తాజ్ మహల్ ఎదురుగా ఉన్న గార్డెన్ కూడా వరదనీటితో మునిగిపోయింది. ఇది జరిగి వారం గడవకముందే డోమ్‌పై మొక్క పెరగడం, గోడలకు పగుళ్లు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై ఆగ్రా సర్కిల్ పురావస్తు శాఖ అధికారిని ప్రశ్నించగా.. తాజ్ మహల్ మాత్రమే కాదు.. ఇతర స్మారక చిహ్నాలన్నింటి మూలల్లో మొక్కలు పెరగడం సర్వ సాధారణం అని చెప్పారు. అలాంటి మొక్కలు మొలకెత్తడం గమనించిన వెంటనే తొలగిస్తామని తెలిపారు.
గత వారం తాజ్ మహల్ వద్ద వర్షాలకు తాజ్ మహల్‌లో లీకేజీలు కనిపించడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. అయితే ఈ లీకేజీకి చర్యలు చేపట్టామని.. తాజ్ మహల్ చుట్టూ డ్రోన్ కెమెరా సాయంతో తనిఖీలు నిర్వహించినట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్ఐ అధికారులు తెలిపారు. అయితే ఈ లీకేజీ వల్ల మెయిన్ డోమ్‌కు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్.. తన భార్య ముంతాజ్ కోసం నిర్మించిన ఈ తాజ్ మహల్.. ప్రేమకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.