భారత్‌కు సంబంధించిన పురాతన వస్తువులను వివిధ దేశాల నుంచి వెనక్కి తీసుకురావడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 600 పురాతన వస్తువులను భారత్‌కు తీసుకువచ్చారు. అయితే అక్రమ మార్గాల్లో స్మగ్లర్ల ద్వారా ఈ వస్తువులు వివిధ దేశాలకు చేరడంతో వాటన్నింటినీ వెనక్కి తీసుకువచ్చేందుకు మోదీ సర్కార్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే 3 రోజుల అమెరికా పర్యటన కోసం వెళ్లిన ప్రధాని మోదీ.. మరిన్ని పురాతన వస్తువులను తీసుకువచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లి ప్రధాని మోదీ.. భారత్‌కు చెందిన 297 పురాతన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక భారత్‌కు చెందిన పురాతన వస్తువులు తిరిగి అప్పగిస్తున్నందుకు అమెరికా ప్రభుత్వానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. దీని వల్ల సాంస్కృతిక వస్తువులను అక్రమ రవాణా చేయడాన్ని నిరోధించవచ్చని మోదీ ట్వీట్ చేశారు. దీంతో 2016 నుంచి ఇప్పటివరకు అమెరికా నుంచి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల సంఖ్య 578కి చేరుకుంది. ఇక ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు.. 2004 నుంచి 2013 మధ్య కాలంలో భారత్‌కు కేవలం ఒకే ఒక వస్తువు వెనక్కి వచ్చింది. కాగా.. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన దేశ సంపదను కొల్లగొట్టి.. విదేశాలకు స్మగ్లింగ్ చేసిన పురాతన వస్తువులను వెనక్కి రప్పించేందుకు తీవ్రంగా కృషి చేసింది. ఈ క్రమంలోనే 2021లో అమెరికాలో మోదీ పర్యటించిన తర్వాత 157 పురాతన వస్తువులు వెనక్కి రాగా.. ఆ తర్వాత గతేడాది మరో 105 వస్తువులను తిరిగి రప్పించారు
ఈ ఏడాది జులైలో ఢిల్లీలో జరిగిన 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సాంస్కృతిక వస్తువులను తిరిగి రప్పించడంపై అమెరికా- భారత్‌ల మధ్య ఒప్పందం జరిగింది. భారత్ నుంచి అమెరికాకు కళాఖండాల అక్రమ రవాణాను నిరోధించడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం కోసం రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. అమెరికా నుంచి భారత్ వస్తున్న పురాతన వస్తువులు దాదాపు 4వేల ఏళ్ల కిందటివి అని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. క్రీస్తు పూర్వ 2000 ఏళ్ల నుంచి 1900 ఏళ్ల మధ్యలోనివి అని వెల్లడించింది. అందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాఖండాలు ఉన్నాయని తెలిపింది. అందులో ఎక్కువగా తూర్పు భారతదేశానికి చెందిన టెర్రకోట కళాఖండాలు అని పేర్కొంది.