బెంగళూరు నగరంలో 29 ఏళ్ల ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటున్న మహాలక్ష్మి అనే మహిళను.. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోనే హత్య చేసి, మృతదేహాన్ని 30 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టేశారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్మెంట్ వాసులు యజమానికి ఫిర్యాదు చేశారు. తొలుత పాడైపోయిన ఆహారం వల్ల దుర్వాసన వస్తుందేమోనని భావించారు. శనివారం దుర్వాసన భరించలేని స్థాయిలో వస్తుండటంతో.. అపార్ట్మెంట్ ఓనర్ ఆ ఇంటి తాళాలు పగులగొట్టి, లోపల పరిశీలించారు. రిఫ్రిజిరేటర్ నుంచి వాసన వస్తున్నట్లు గుర్తించి డోర్ ఓపెన్ చేసి హతాశులయ్యారు. మొత్తం మహిళ శరీర భాగాలు, రక్తంతో ఫ్రిజ్ నిండిపోయి ఉంది.
జార్ఖండ్‌కు చెందిన మహాలక్ష్మికి కొన్నేళ్ల కిందట హేమంత్ దాస్‌తో వివాహమైంది. భర్తతో విభేదాల కారణంగా మహాలక్ష్మి కొన్ని నెలల కిందట నుంచి వేరుగా ఉంటోంది. వ్యాలికావల్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్లో సింగిల్ బెడ్రూమ్ గదిని అద్దెకు తీసుకొని ఉంటోంది. అపార్టుమెంట్ ఓనర్.. మహాలక్ష్మి తల్లికి, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హత్య విషయం తెలుసుకున్న మహాలక్ష్మి భర్త హేమంత్ సైతం అక్కడికి చేరుకున్నారు. పోలీసులు హేమంత్‌ను, మహాలక్ష్మి తల్లిని విడిగా ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
మహాలక్ష్మిని తరచూ ఒక యువకుడు ఉదయం తీసుకెళ్లి, సాయంత్రం ఇంటివద్ద వదిలి వెళ్లేవాడని స్థానికులు చెబుతున్నారు. ఆ యువకుడే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. 4, 5 రోజుల కింద ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహాలక్ష్మి ఫోన్ సెప్టెంబర్ 10 నుంచి స్విచ్ఛాఫ్ వస్తోందని ఆమె తల్లి తెలిపారు. ఈ ఘటన బెంగళూరు నగరాన్ని వణికించింది. దేశ రాజధాని ఢిల్లీలో 2022లో శ్రద్ధా వాకర్ దారుణ హత్య తరహాలో ఈ ఘటన జరిగింది. శ్రద్ధా వాకర్‌ను ఆమె లివ్-ఇన్ పాట్నర్ ఆఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. 3 వారాల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.