వందల కోట్ల మందికి శ్రీవారు ఆరాధ్య దైవం. తిరుమల ప్రసాదానికి అత్యంత పవిత్రత ఉందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అలాంటి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారన్న అనుమానాలు రేకెత్తించింది ముఖ్యమంత్రి చంద్రబాబే కాబట్టి.. వాటి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ఆయనదే. అసలు కల్తీ నెయ్యిని వాడనప్పుడు.. అపచారానికి తావే లేదు. ఈ విషయంలో పూర్తి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన చంద్రబాబు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలపై దెబ్బకొట్టారు.దాన్ని సవరించాల్సిన బాధ్యతను విస్మరించి సంప్రోక్షణ అంటూ ఇంకా డ్రామాలు చేస్తున్నారు’ అని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు దేవుణ్ని వాడుకోవడం దారుణం అన్నారు.
‘నిజానికి నెయ్యిని అలా కల్తీ చేయడం సాధ్యమా? ఎవరైనా ఆ పని చేస్తారా? ఒకవేళ చేస్తే దేశ ద్రోహులు మాత్రమే ఆ పని చేయాలి. టెర్రరిస్టులో లేక మత విద్వేషం ఉన్న వారో చేయాలి. ఒకవేళ నెయ్యిలో నాణ్యత లేకపోతే, దాన్ని లోపలికి కూడా పోనివ్వరు. అలాంటప్పుడు నాణ్యత లేని నెయ్యిని వాడే అవకాశమే లేదు. కానీ, చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రధానికి, సీజేఐకి లేఖ వ్రాశారు. పూర్తి స్థాయిలో విచారించాలని కోరారు. వాస్తవాలు తేల్చాలని, భక్తుల మనోభావాలు నిలబెట్టాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.