కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారికే కళంకం తెచ్చేలా సీఎం చంద్రబాబు వ్యవహరించడం దుర్మార్గమని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.నిజాలు నిగ్గు తేల్చేందుకు తాము విచారణకు సిద్ధమన్న భూమన, ఈ విషయంపై పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ రాశారని వెల్లడించారు. టీటీడీలో అన్ని వ్యవస్థలూ పక్కాగా పని చేస్తాయన్న ఆయన, గత ప్రభుత్వ హయాంలో ఏ నియమాలు మార్చలేదని, ఆచార, వ్యవహారాల్లో ఏనాడూ తప్పు చేయలేదని చెప్పారు. లడ్డూ తయారీలో కొవ్వు నెయ్యి అనేది అవాస్తవమని స్పష్టం చేశారు. తిరుపతిలో పార్టీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అసలు నెయ్యి నాణ్యత పరీక్ష జరిగింది.. ఎన్డీడీబి రిపోర్ట్ వచ్చింది ఈ ప్రభుత్వ హయాంలోనే, గత జూలైలో అని గుర్తు చేసిన భూమన, ఆ నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపామన్న ఈఓ మాటలను ప్రస్తావించారు. అలాంటప్పుడు కల్తీ నెయ్యి ఎక్కడ వాడారని ప్రశ్నించారు.
జగన్‌గారిని రాజకీయంగా ఎదుర్కోలేకే సీఎం చంద్రబాబు ఇంత దారుణంగా ఆరోపణలు చేస్తూ, స్వామివారికే కళంకం తెచ్చేలా అనైతిక నిందలు మోపుతున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ ఆక్షేపించారు. చంద్రబాబు దారుణ ఆరోపణలకు పాపపరిహారం తప్పదని ఆయన హెచ్చరించారు.రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు పూర్తిగా దిగజారి వ్యవహరిస్తున్నారని, చివరకు శ్రీవెంకటేశ్వరస్వామి వారిని కూడా వాడుకుంటున్నారని భూమన ఆగ్రహించారు. తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం చంద్రబాబుకు అలవాటన్న ఆయన, ఆ దిశలోనే ఇప్పుడు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని చెప్పారు.
నెయ్యి నాణ్యత గురించి ముందు మాట్లాడిన టీటీడీ ఈఓ, అందులో వెజిటబుల్ ఫ్యాట్, వనస్పతి కలిపారని చెప్పారని.. అనంతరం రెండు నెలల తర్వాత, చంద్రబాబు ఆరోపణలు చేయగానే, మళ్లీ మీడియాతో మాట్లాడి.. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి కలిపారని ఎన్డీడీబీ నివేదికలో రాశారని చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన భూమన.. ఈఓ అలా మాట ఎందుకు మార్చారని నిలదీశారు. నిజానికి టీటీడీలో నెయ్యి కలుషితం కాలేదని, ఒక మనిషిగా చంద్రబాబు కలుషితమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.