వైసీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు. రాళ్లు, రంగు డబ్బాలు విసిరిన బీజేవైఎం కార్యకర్తలు.. వైయస్ఆర్ సీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులపై దాడికి యత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది గదిని బీజేవైఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు. కాగా, చంద్రబాబు సర్కార్ వంద రోజుల వైఫల్యాలు, విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకాలపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని కప్పి పుచ్చేందుకు కూటమి నేతలు డైవర్షన్ రాజకీయాలకు తెర తీస్తున్నారు.
బీజేవైఎం కార్యకర్తల తీరును మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ప్రోద్భలంతోనే వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలే దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. చేతిలో అధికారం ఉంది కదా విచారణ చేపట్టాలన్నారు. మా అధినేత వైయస్ జగన్ కూడా ఇదే డిమాండు చేశారని గుర్తు చేశారు. తీరు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.