జనసేన పార్టీకి చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజి ఒక దళిత ప్రొఫెసర్ మీద దాడి ఘటనను మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఖండించారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీనిపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ తన ప్రాయశ్చిత్త దీక్ష చంద్రబాబు చేసిన తప్పిదాలను క్షమించమని చేస్తున్నారా లేక చంద్రబాబు తిరుమల పవిత్రను దెబ్బ తీసినందుకు చేస్తున్నరా అని ప్రశ్నించారు. తిరుమల ప్రసాదంలో వాడే పదార్ధాలను మూడు దశలలో తనిఖీలు చేసే విధానం ఏళ్లతరబడి అనవాయితీగా వస్తుందని... గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనూ అలా తనిఖీలు చేసిన తర్వాత పలుదఫాలుగా నాణ్యత లేని ముడిసరుకులను వెనక్కి పంపిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జూలై 17న తిరుమలకు వచ్చిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో వెనక్కి పంపించామని స్వయంగా ఈవో చెప్పినప్పుడు.. ఆ పదార్ధాలను ప్రసాదాల తయారీలో వినియోగించారన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు. అంటే చంద్రబాబుది రాజకీయాల కోసం తిరుమల కొండను వాడుకోవాలన్న దురుద్ధేశ్యం కాదా అని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నిలదీశారు.
ఆ నెయ్యిలో వనస్పతి ఉందని ఈవో తొలుత ప్రకటిస్తే... ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత అందులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంటే చంద్రబాబు ప్రతి రాజకీయ అడుగులోనూ కుట్ర దాగి ఉంటుందన్నారు. కేవలం తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ వివాదాన్ని వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. తిరుమల ప్రసాదాల వివాదంపై సీబీఐ విచారణ చేయించాలని ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. కచ్చితంగా ప్రజలకు వాస్తవాలు అప్పుడే తెలుస్తాయన్నారు.