దేశంలో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. అయితే కూరగాయల ధరలు కూడా మండిపోగా, ప్రస్తుతం ధరలు అదుపులోకి వచ్చాయి.కానీ ఉల్లి ధర మాత్రం ఏ మాత్రం దిగడం లేదు. హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర 60 రూపాయల వరకు పలుకుతోంది. ప్రతి వంటల్లో ఉపయోగించే ఉల్లి.. ఇప్పుడు వంటగదిలో నిల్వ ఉండటం లేదు. ఉల్లిపాయలు కొనాలంటే వెనుకడుగు వేస్తున్నారు సామాన్యులు. ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదివరకు సేకరించిన ముందస్తు నిల్వ (బఫర్ స్టాక్)ను హోల్ సేల్ మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించింది.
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన తర్వాత దేశీయంగా ఉల్లి రిటైల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టింది కేంద్రం. ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లోని హోల్ సేల్ మార్కెట్ లోకి బఫర్ స్టాక్ విడుదల చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.ప్రస్తుతం ఢిల్లీలో కిలో రూ.55, ముంబైలో రూ.58, చెన్నైలో రూ.60 పలుకుతోంది. ఎన్సిసిఎఫ్, నాఫెడ్ ద్వారా రాష్ట్రాల రాజధానుల్లో రూ.35 కిలో చొప్పున మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిని విక్రయిస్తోంది కేంద్రం. ఖరీఫ్‌లో ఉల్లి సాగు పెరగడంతో ధరలు తగ్గుతాయని భావిస్తున్న కేంద్రం భావిస్తోంది
ఇదిలా ఉండగా, ఉల్లి ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం.. టమాట ధరలపై కూడా నిఘా పెడుతోంది. ఇటీవల నుంచి టమాట ధర కూడా భారీగానే పెరుగుతోంది. హైదరాబాద్‌లో సాధారణ మార్కెట్లో గత ఆదివారం కిలో టమాట ధర 50 రూపాయల వరకు పలికింది.