యానాంలో రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ విజయం సాధిస్తే తాను గుండు గీయించుకుంటానని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు బహిరంగంగా ప్రకటించారు. ఆదివారం సాయంత్రం యానాం పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని ఉన్న సూర్య క్లబ్ ఎదురుగా మల్లాడి ఆందోళన చేపట్టారు. తొలుత తన స్వగృహంలో ఏర్పాటుచేసిన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో మల్లాడి మాట్లాడారు. అనంతరం ర్యాలీగా సూర్య క్లబ్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు గిడ్ల చంద్రరావు, మల్లాడి శామ్యూల్, పెండె సూర్యప్రకాష్ మాట్లాడారు. అనంతరం మల్లాడి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఏఒక్క క్లబ్ యానాంలో ఏర్పాటు కాలేదన్నారు. అధికారం మారిన వెంటనే క్లబ్‌లు యానాంలో పుట్టుకొచ్చాయన్నారు. ఒక్కప్పుడు పర్యాటక కేంద్రంగా ఉన్న యానాం ఇప్పుడు పేకాట కేంద్రంగా మారిందన్నారు.
సుప్రీం కోర్టు వరకు వెళ్లి రాయల్ క్లబ్‌ను మూయించామన్నారు. సూర్య క్లబ్‌ను మూయకపోతే తాను ఆందోళనచేస్తానని ప్రకటించడంతో ఇప్పుడు సూర్య క్లబ్‌ను తాత్కాలికంగా మూశారని మల్లాడి అన్నారు. సూర్య క్లబ్‌ను శాశ్వతంగా మూస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సూర్య క్లబ్‌ను శాశ్వతంగా మూయించే వరకు పోరాటం ఆగదన్నారు. సూర్య క్లబ్ నిర్వహణలో పోలీస్ శాఖలో ఐదుగురు ఉన్నతాధికారుల పాత్ర ముఖ్యంగా ఉందని తెలిసిందని, త్వరలోనే వారిపై కూడా పుదుచ్చేరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో గొల్లపల్లి గెలిస్తే తాను గుండు గీయించుకుంటానని మల్లాడి అన్నారు. మహిళలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు.