తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంతో అపచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో చేపట్టిన మహా శాంతియాగం ముగిసింది. పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం పూర్తి అయ్యింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి యాగాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహించారు.
ముందుగా మహాశాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరిగింది. కాగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. ప్రస్తుతం మహా శాంతియాగం ముగియగా.. మరికాసేపట్లో పంచగవ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకుళ మాత పోటు, లడ్డు పోటు, బూందీ పోటు, ప్రసాద విక్రయశాలల్లో అర్చకులు సంప్రోక్షణ చేయనున్నారు.