విజయనగరంలోని అయ్యన్నపేట దువ్వాడ జంక్షన్ సమీపంలో ఉన్న చంద్రమౌళీశ్వర ఆలయ హుండీ చోరీ కేసులో విజయనగరం మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన బెల్లాన బాలరాజును అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. ఈ వివరాలను ఆదివారం వెల్లడించారు. ఈనెల 19న ఆలయ అర్చకులు జయంతి శ్రీనివాసశర్మ పూజలు నిర్వహించుకొని ఇంటికి వెళ్లి పోయారు. మరుసటిరోజు ఆలయానికి రాగా హుండీ చోరీకి గురైనట్లు గుర్తించి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆలయంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. పాత నేరస్తుడు బాలరాజును అదుపు లోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. బాలరాజు నుంచి రూ.30వేలు నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి రిమాండు విధించారు. బాలరాజుపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 16, రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 3, విజయనగరం రూరల్, పార్వతీపురం, డెంకాడ, నెల్లిమర్ల, జామి, భీమిలి స్టేషన్ల పరిధిలో 26 కేసులు ఉన్నట్లు సీఐ వివరించారు.