సీఎం స్థాయిలో చంద్రబాబు మాటలు బాధ కలిగించాయని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను బాబు భయబ్రాంతులకు గురిచేశారని విమర్శలు గుప్పించారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్ల ద్వారా నెయ్యి సేకరణ జరుగుతుందని, ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తారని తెలిపారు.
టీటీడీ లడ్డూపై సీఎం చంద్రబాబు చాలా దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారని, అందువల్ల విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తేవాలని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఇలాంటి ఆరోపణ చేశారన్న ఆయన, అందుకు భక్తుల సెంటిమెంట్‌ను వాడుకోవడం తప్పని, అలా స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించడం ఏ మాత్రం సరి కాదని తేల్చి చెప్పారు. 100 రోజుల్లోనే ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోర వైఫల్యం చెందిందని, వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ కుట్ర చేస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు దిట్ట అని అభివర్ణించారు. తిరుమల విషయంలో అనవసర ఆరోపణలు చేసి స్వామివారి ప్రతిష్టను మంటగలపద్దని శ్రీకాంత్‌రెడ్డి కోరారు.