తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇవాళ మరింత మంది కేంద్ర మంత్రులను ఆ లేఖకు ట్యాగ్ చేశారు.
తాను రాసిన లేఖలోని వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఆయన కేంద్ర మంత్రులను ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులు ఉన్నారు. వాళ్లందరి మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. లేకపోతే చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయని, భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారి తీస్తాయని వైయస్ జగన్ తన లేఖలో రాశారు.