ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన.. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మెట్ల మార్గాన ఆయన తిరుమలకు వెళ్లనున్నారు.
అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అపచారం జరిగిపోవడంతో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు ఆయన పూనుకున్నారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ (మంగళవారం) ఇంద్రకీలాద్రికిి వెళ్లనున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు.