తిరుపతి లడ్డూ వివాదం రాజకీయాలతో పాటు సినిమా రంగాన్ని సైతం తాకుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సినిమా నటుడు ప్రకాష్ రాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం.. ఇక పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగిపోయాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కౌంటర్‌కు ప్రకాష్ రాజ్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌కు కౌంటరిచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ అయ్యిందని తాము బాధపడి పోరాటం చేస్తుంటే మధ్యలో ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధముందని ప్రశ్నించారు. తాను ఏ మతాన్ని తక్కువ చేయలేదని.. అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారంటూ పవన్ నిలదీశారు. సెక్యులరిజం అంటే టూవే అని వన్ వే కాదంటూ హితవు పలికారు. ప్రకాష్ రాజ్ మీద గౌరవం ఉందని.. ఇలా మాట్లాడి తగ్గించుకోవద్దంటూ సూచించారు.
అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ మరోసారి స్పందించారు. తాను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నానన్న ప్రకాష్ రాజ్.. తర్వాత దీనిపై స్పందిస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ చూశానన్న ప్రకాష్‌రాజ్.. తన ట్వీట్‌ను పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తాను చెప్పినదానికి పవన్ అర్థం చేసుకున్నదీ తెలిసి ఆశ్చర్యమేస్తోందన్నారు. ప్రస్తుతం విదేశాల్లో తాను షూటింగ్‌లో ఉన్నానని.. ఇండియాకు వచ్చిన తర్వాత మీ ప్రశ్నలకు సమాధానమిస్తానని చెప్పారు. ఆలోపు వీలైతే తన ట్వీట్‌ను మరోసారి చదువుకుని అర్థం చేసుకోవాలంటూ సెటైర్ వేశారు.
అయితే పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌పై జనసేన శ్రేణులు రియాక్టవుతున్నాయి. మీ ట్వీట్‌ను తాము సరిగానే అర్థం చేసుకున్నామని.. దయచేసి కేంద్రంపై ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని అందరిపై రుద్దకండి అంటూ జనసేన శతఘ్ని ట్వీట్ చేసింది. " మీ ట్వీట్‌ను మేము సరిగానే అర్థం చేసుకున్నాం, ఈ అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సిట్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధమైన చర్య జరిగినప్పుడు ప్రతీ ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. కోట్లాది హిందువులతో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెతో తయారు చేసిన లడ్డూ తినేలా చేసినప్పుడు, ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిందే. ఎక్కడైనా ఇతర మతాల వారి మీద ఘటనలు జరిగితే దేశంలో సెక్యులరిజం లేదు అని గగ్గోలు పెట్టే మీరు, 100 కోట్లకు పైగా హిందువుల విశ్వాసాలు దెబ్బతీసిన ఘటనపై దేశం స్పందించకుండా ఉండాలి అంటే ఎలా?" అంటూ జనసేన శతఘ్ని ట్వీట్ చేసింది.
"దేశంలో ఎన్నో గొడవలు ఉన్నాయి అంటున్నారు, వాటిలో ఒక వర్గానిదే తప్పు అన్నట్లుగా మీకు ఎలాగో కనిపిస్తుంది, కారణాలు మీ రాజకీయ విధానాలు కావచ్చు, మాకు అనవసరం. ఇది హిందువుల మత విశ్వాసాలకు సంబంధించిన విషయం. మీకు పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం అర్ధం అవుతుంది అని అనుకుంటున్నాం. సమస్య ఎవరిదైనా సరే గొంతెత్తి రాజకీయాలకు అతీతంగా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. , ఈ విషయం వ్యక్తిగతంగా మీకు తెలుసు. బహుశా నేపాల్ లో ఉన్నట్లున్నారు. అక్కడ హిందువులను ఒకసారి ఈ ఘటన గురించి స్పందన అడగండి, మీకు అర్థం అవుతుంది. దయచేసి కేంద్ర నాయకత్వంతో మీకు ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని అందరిపై రుద్దాలని చూడకండి" అంటూ ట్వీట్ చేసింది.